Total Pageviews

Thursday, August 26, 2010

జయ! విష్ణో! కృపాసింధో! జయతామరసేక్షణా!
జయలోకైక వరద! జయభక్తార్తి భంజన!
అనన్త మక్షరం శాంతం అవాఙ్మానస గోచరమ్‌|
త్వామామనన్తి పురుషంప్రకృతే: పరమచ్యుతమ్‌||
స్కాం. అ.38, శ్లో. 25-27;
''ఓ కృపానిధీ! పద్మదళే క్షణా! లోకైక భక్తవరప్రద! భక్తార్తి భంజన! జయము జయము. అనంతుడవు, నాశములేనివాడవు, శాంతు డవు, అవాఙ్మానస గోచరు డవు, చిదానంద స్వరూపుడ వైన నిన్నెరిగిన వారెవ్వరు? నీవు అణువుకంటే అణువు, స్థూలమైన వాటికంటే స్థూల మైనవాడవు, సర్వాంత ర్యామివి, ప్రకృతి కంటే గొప్పవాడవైన పురుషుడవని వేదాలు చెబుతున్నాయి.
వేదాంత సారరూపుడవు, అన్నింటిలోనూ లోపల, బయటా ఉన్నవాడవైన నిన్నీ మాయధీనమైన దేహం ధరిం చిన వారిలో ఎవరు వర్ణించగలరు? అతి భయంకరమైన నీ రూపాన్ని చూసి మేమందరం భయపడు తున్నాం. కాబట్టి శాంతరూపాన్ని ధరిం'' చమని వారంతా ప్రార్థించారు.
బ్రహ్మాది దేవతలీ విధంగా స్తుతించగా శ్రీమన్నా రాయణుడు అనుగ్రహించి మేఘ గంభీరమైన వాక్కుతో సాదరంగా ''భయంకరమైన ఈ రూపాన్ని వదలి ప్రియమైన శాంతరూపాన్ని ధరిస్తాను. కలత లేకుండా నన్ను దర్శించండి'' అని పలికి అంతర్థా నమై మరుక్షణంలోనే రత్నఖచితమైన దివ్య విమానంలో సుందరరూపంతో సాక్షాత్కరించాడు.
చంద్రబింబానన:శాంతో నీలోత్పలదలద్యుతి:|
సువర్ణ వర్ణవసనో రత్నభూషణభూషిత:|
శంఖచక్ర గదాపద్మ లసత్కరచతుష్టయ:|
తమాలోక్య రమాకాంతం
భూయోభూయో వవందిరే||
స్కాం. అ.38, శ్లో 33,34.
చంద్రబింబం వంటి ముఖం కలవాడు, శాంత స్వభావుడు, నల్లకలువ రేకులవంటి కాంతి కలవాడు, బంగారు రంగు వస్త్రం ధరించిన వాడు, రత్నాభరణాలను ధరించినవాడు, లక్ష్మీపతిని దర్శించి వారంతా సాష్టాంగదండ ప్రమాణాలునాచరించారు. బ్రహ్మాది దేవతలను వారి వారి అభీష్టానుసారం సంతోషపరచి వినయంతో, వినమ్రుడైన అగస్త్య మహర్షితో ''మునీంద్రా! నీవు నా కోసం చేసిన భయంకరమైన తపస్సు, వ్రతాలవల్ల చాలా కష్ట పడ్డావు. కాబట్టి నీవు కోరిన వరాలనిస్తాను. కోరుకో!'' అన్నాడు మహావిష్ణువు.
భగవంతుని మాటలు విన్న అగస్త్యుడు పులకిత గాత్రుడై నమస్కరించి ఇలా అన్నాడు.
''ప్రభూ! నేను చేసిన హోమాలు, ఆచరించిన తపస్సు, చదివిన చదువు అంతా నీ అనుగ్రహం వల్లనే సఫలమైంది. నిన్ను గురించే ధ్యానిస్తున నన్ను వెతుక్కుంటూ నీవే వచ్చావు. కాబట్టి ముల్లోకాల్లో నేను ఒక్కణ్ణ ధన్యుణ్ని. నీ అనుగ్రహం వల్ల నా మనోరథాలన్నీ ఈడేరాయి. మాధవా! ఎంత ఆలోచించినా నాకు పొందదగినదేమీ కనిపించడం లేదు. అయినా ప్రభూ! మానవ చాపల్యంతో నేను మీకు మనవి చేసుకుంటున్నాను.
'త్వత్పాదాంబుజయోర్భక్తం యేవం కురు నిరంత రమ్‌' - నీ పాదపద్మాలపై నిరంతరం భక్తి ఉండేలా అనుగ్రహించు. దేవతల ప్రార్థనతో, నేన చేసే విన్నపా న్నాలించు. ఈ పర్వత పార్శ్వంలోసువర్ణ ముఖి నది ఉంది. అది తనలో స్నానం చేసిన వారి పాపాలను పోగొడుతుంది. మీ కరుణా వీక్షణాలతో మీరా నదిని కృతార్థురాలిని చెయ్యండి. ఆ నదిలో స్నానం చేసి వేంకటాచలంపై ఉన్న మిమ్మల్ని సేవించే వారికి భుక్తి, ముక్తులను ప్రసాదించం'' డని ఇంకా ఇలా అంటున్నాడు అగస్త్యుడు.

No comments:

Post a Comment