చతుర్వేదాలు
హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం.
వేదానికి నిగమము, శ్రుతి, ఆమ్నాయము అని కూడా పేర్లున్నాయి
- నిగమము - అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము
- శ్రుతి - గురువునుంచి శిష్యుడు వినే దివ్యవాణి
- ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.
మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ, కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.
వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).
మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి
ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.