హిందూ మత పురాణాలు మత మార్పిడిని గూర్చి ఏమీ ప్రస్తావించకపోవడం మూలాన ఒక హిందువు మతం మారవచ్చా లేదా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయ కానీ హిందూ మతాన్ని ఒక తత్వంగా, లేదా ఒక జీవన విధానంగా భావించేవారు, హిందూ నమ్మకాలను తమ జీవన విధానంలో ఇముడ్చుకున్నవారు ఎవరైనా హిందువులు కాగలరని చెబుతుంటారు. కొద్ది మంది మాత్రం హిందూ మతాన్ని ఒక జాతిగా పరిగణించడం వలన హిందువులకు జన్మించినవారు మరియు భారతదేశంలో జన్మించిన వారే హిందువులు కాగలరని విశ్వసిస్తారు. కానీ భారతదేశపు ఉత్కృష్ట న్యాయస్థానం మాత్రం, జాతి, వారసత్వాలతో ప్రమేయం లేకుండా, హిందూమత విశ్వసాల్ని అవలంబించే ఎవరినైనా హిందువులుగా పరిగణించవచ్చునని తెలుపుతోంది. చాలా సాంప్రదాయాల్లో ఆధ్యాత్మిక జీవనం దీక్ష అనే ప్రక్రియతో ప్రారంభమౌతుంది. కానీ హిందూ మతంలోకి మారడానికి ప్రత్యేక పద్దతులంటూ ఏమీ లేవు. ఏ మతాన్నైనా నిర్మల భక్తితో అవలంబించడం వలన భగవంతునికి చేరువ కాగలరు అనేది హిందూమతం యొక్క ముఖ్య సూత్రం. అందువల్లనే హిందువులు ఇతర మతాల వారిని తమ మతంలో చేరమని బలవంతం చేయరు. అయినప్పటికీ కొన్ని హిందూ మత సంస్థలైన వేదాంత సమాజం,ఇస్కాన్, ఆర్య సమాజ్ మున్నగునవి విదేశాలలో హిందూమత ప్రాశస్థ్యాన్ని గూర్చి ప్రజలకు వివరించి మార్గ నిర్దేశం చేస్తుంటాయి